“””””””””””””””””””””””””””
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజాపై మరోసారి వివాదం చెలరేగింది. ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో భారీ అవినీతి జరిగిందన్న ఆరోపణలపై ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. శాప్ చైర్మన్ రవినాయుడు ఫిర్యాదు మేరకు విజిలెన్స్ విభాగం సుదీర్ఘ విచారణ జరిపి నివేదిక సిద్ధం చేసినట్లు చెబుతున్నారు.
గత వైసీపీ ప్రభుత్వ కాలంలో కేవలం 45 రోజుల్లోనే 119 కోట్లు ఖర్చు చేసిన ఈ ప్రాజెక్టులో సుమారు 100 కోట్ల అవినీతి జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. క్రీడా పరికరాల కొనుగోలు, ముగింపు వేడుకల నిర్వహణలో నిబంధనలు ఉల్లంఘించినట్లు విచారణలో తేలిందని ప్రచారం జరుగుతోంది. జిల్లా క్రీడా సంఘాల ఖర్చులను కలుపుకుంటే ఈ స్కాంలో మొత్తం 400 కోట్ల వరకు అవినీతి జరిగిందని ప్రతిపక్షం ఆరోపిస్తోంది.
విజిలెన్స్ నివేదిక ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వానికి అందే అవకాశం ఉంది. అందులో అవినీతి నిర్ధారితమైతే, అప్పటి క్రీడా మంత్రిగా ఉన్న రోజాపై కేసు నమోదు చేసి అరెస్టు చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో ఆడుదాం ఆంధ్రా కేసు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త దుమారం రేపుతోంది. అప్పటి శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని కూడా విచారిస్తారు.

