బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కొత్త కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌పై ప్రశ్నించగా, దానిపై మాట్లాడను, ఇంకేదైనా విషయంపై మాట్లాడండంటూ స్పష్టంచేశారు.
రాఖీ పౌర్ణమి రోజు కేటీఆర్‌కు రాఖీ ఎందుకు కట్టలేదనే ప్రశ్నపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ విషయంపై సమాధానం చెప్పకుండా దాటవేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజలను మభ్యపెడుతోందని, 42 శాతం బీసీ రిజర్వేషన్ సాధ్యమా? అసాధ్యమా? సీఎం రేవంత్ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో చేసిన ధర్నా ఎవరి కోసం అనేదాన్ని కూడా కాంగ్రెస్ వివరణ ఇవ్వాలని అన్నారు.
బీజేపీపై కూడా తీవ్ర విమర్శలు చేసిన కవిత.., ఆ పార్టీలో నేతల మధ్య సఖ్యత లేదని, రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావును పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బండి సంజయ్‌పై ఈటల రాజేందర్ చేసిన హెచ్చరిక గురించి స్పందించలేదంటే అర్థం ఏంటని ప్రశ్నించారు. బీజేపీ ప్రజలను ఓటు బ్యాంకుగా వాడుకుంటోందని కామెంట్ చేశారు. సింగరేణి కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలిగా, ఇతర సంఘాలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామని తెలిపారు.

