భారత్‌ను వ్యూహాత్మకంగా అడ్డుకోవాలన్న తొందరలో పాకిస్తాన్ మరోసారి ప్రమాదకరమైన మార్గంలో నడుస్తోంది. ఇరాన్‌లో భారత్ నిర్మిస్తున్న చాబహార్ పోర్టు విజయం ఖాయమని గ్రహించిన పాక్, దానికి ప్రత్యామ్నాయంగా అమెరికాతో కొత్త ఒప్పందానికి ప్రయత్నిస్తోంది. పాస్తీ ప్రాంతంలో అమెరికా పెట్టుబడులతో కొత్త పోర్టు ప్రాజెక్టుకు పాకిస్తాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంతర్జాతీయ వర్గాలు చెబుతున్నాయి.
దీని లక్ష్యం స్పష్టమే.. భారత్‌కు మధ్య ఆసియాపై లభించే వ్యూహాత్మక ఆధిక్యాన్ని తగ్గించడం. అయితే నిపుణులు హెచ్చరిస్తూ, ఇది మరోసారి పాక్ భూభాగాన్ని విదేశీ శక్తులకు అప్పగించే చర్యగా మారుతుందని అంటున్నారు. ఇప్పటికే చైనా–పాక్ ఎకనామిక్ కారిడార్ CPEC పేరుతో గ్వాదర్ పోర్టు చైనా ఆధీనంలోకి వెళ్లిపోయింది. భారీ రుణాలతో చైనా ఆధీనంలో కూరుకుపోయిన పాక్ ఇప్పుడు అమెరికా వైపు చూడటం ప్రమాదకరమని విశ్లేషకులు చెబుతున్నారు.
చైనా, అమెరికా రెండింటి ప్రభావం మధ్య పాక్ ఒక పావుగా మారే ప్రమాదం ఉంది. కొత్త పెట్టుబడులు ఆర్థిక ఉపశమనంగా కాకుండా, మరింత రుణ బారం తెచ్చే అవకాశం ఎక్కువ.
నిపుణుల మాటల్లో భారత్‌కు కౌంటర్ ప్రయత్నం చేస్తూ, పాకిస్తాన్ తన భవిష్యత్తుకే కౌంటర్ వేసుకుంటుంది.

