విశాఖలో జరిగిన జనసేన ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. బీఆర్ఎస్ పార్టీని ప్రస్తావిస్తూ ఆయన భావజాలం, భావోద్వేగాల మధ్య తేడాను వివరించారు. తెలంగాణా వాదంతో టీఆర్ఎస్‌గా పుట్టిన పార్టీ కాలక్రమంలో బీఆర్ఎస్‌గా మారిందని ఉదాహరణ ఇచ్చారు. ఒక పార్టీ భావజాలం లేదా వ్యక్తి చుట్టూ ఏర్పడిన భావోద్వేగం శాశ్వతం కాదని, పరిస్థితులకు అనుగుణంగా మార్పులు తప్పవని పవన్ చెప్పారు. తన ఉద్దేశం బీఆర్ఎస్‌పై విమర్శ కాదని, కాల గమనంలో జరిగే పరిణామాలను గుర్తు చేయడమేనని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యల వెనుక పవన్ ఏపీలోని పార్టీలకు కూడా ఒక సందేశమిచ్చారా? అన్నదానిపై చర్చ మొదలైంది. ఎందుకంటే భావోద్వేగాలపై ఆధారపడి నిలిచే పార్టీలు ఎక్కువకాలం కొనసాగలేవని ఆయన చెప్పినట్టు కనిపిస్తోంది.

