తమిళనాడు రాజకీయాల్లో కొత్త సంచలనానికి తెరలేపుతున్నాడు దళపతి విజయ్. గత ఏడాది వెట్రి కళగం పార్టీని ప్రారంభించిన ఆయన, తొలిసారి తిరుచ్చి నుంచి బస్సు యాత్ర మొదలు పెట్టారు. ప్రతి వారం రెండు రోజులు రాష్ట్ర పర్యటన చేస్తూ పార్టీకి బలమైన పునాది వేసుకోవాలని నిర్ణయించారు. మొదటి రోజే పెరంబలూర్, అరియలూర్ జిల్లాల్లో విజయ్ యాత్రకు భారీ స్పందన లభించింది. దాదాపు రెండు లక్షల మంది పాల్గొన్నారని అంచనా.
ఇప్పటివరకు రెండు మహాసభల్లోనూ లక్షలాదిగా అభిమానులు చేరుకోవడం, తాజా బస్సు యాత్రకు కూడా అద్భుత స్పందన రావడం విజయ్ జోరును చూపిస్తోంది. రజనీకాంత్, కమలహాసన్, విజయ్‌కాంత్ వంటి సినీ సూపర్‌స్టార్లు రాజకీయాల్లో పెద్దగా సక్సెస్ కాలేదు. అయితే విజయ్ మాత్రం ఎంజీఆర్, జయలలిత లాంటి లీడర్ల లాగానే కొత్త రాజకీయ శకం తెచ్చే ప్రయత్నంలో ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు.
అయితే యాత్రలో ఏర్పాట్ల లోపాలు, అభిమానుల ఉత్సాహం వల్ల గందరగోళం చోటు చేసుకోవడం వంటి సవాళ్లు ఎదురవుతున్నాయి. రానున్న ఎన్నికల్లో డీఎంకే, ఏఐడీఎంకే ఆధిపత్యానికి ప్రత్యామ్నాయంగా విజయ్ పార్టీ ఎదగగలదా? అనేదే ప్రశ్న.

