తెలుగు రాష్ట్రాల్లో మరోసారి నకిలీ నోట్లు సంచలనం రేపుతున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున దొంగ నోట్లు చలామణి అవుతున్న ఘటన వెలుగుచూసింది. జుక్కల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో నకిలీ కరెన్సీతో లావాదేవీలు జరుగుతున్నాయని పోలీసులు గుర్తించారు.
అప్పు తీసుకున్న ఓ వ్యక్తి దొంగ నోట్లు ఇచ్చాడని ఫిర్యాదు రావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పెద్దకొడప్‌గల్, అంతాపూర్, జుక్కల్ వజ్రకండి గ్రామాలకు చెందిన ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారి వద్ద నుంచి భారీ మొత్తంలో నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు.
ప్రాథమిక విచారణలో ఈ దొంగ నోట్లు మహారాష్ట్ర నుంచి సరఫరా అయ్యాయని పోలీసులు తెలిపారు. ఇంకా ఈ నోట్లు ఎక్కడెక్కడ చలామణి అయ్యాయో తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద నోట్లు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
గతంలో కూడా కామారెడ్డి, బాన్సువాడ, గాంధారి ప్రాంతాల్లో ఫేక్ నోట్లు బయటపడ్డ సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంతో జిల్లా ప్రజల్లో ఆందోళన నెలకొంది.

