వైసీపీ సీనియర్ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ సుబ్బారెడ్డిని ఇబ్బందుల్లోకి నెట్టేలా సుపథం టికెట్ల వ్యవహారం తెరపైకి వచ్చింది. తిరుమల కల్తీ నెయ్యి కేసులో నిందితుడైన చిన్నప్పన్నకు తనతో ఎలాంటి సంబంధం లేదని సుబ్బారెడ్డి చెబుతున్న నేపథ్యంలో, ఒక నెలలో చిన్నప్పన్న పేరిట 6433 సుపథం టికెట్లు జారీ అయిన విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
జగన్ ప్రభుత్వ కాలంలో ఒక్కో ఎమ్మెల్యేకు రోజుకు ఆరు సుపథం టికెట్లు మాత్రమే జారీ చేసే నిబంధన ఉండగా, 2021 సెప్టెంబరులో చిన్నప్పన్న పేరిట రోజుకు సగటున 214 టికెట్లు జారీ కావడం సంచలనం రేపుతోంది. ఏపీ భవన్‌లో లైజన్ ఆఫీసర్‌గా పని చేసిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి పేరుమీద టీటీడీ ఛైర్మన్ కార్యాలయం వేలాది టికెట్లు ఎందుకు జారీ చేసిందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
2018 వరకు చిన్నప్పన్న తన పీఏగా పనిచేశాడని అంగీకరించిన సుబ్బారెడ్డి, ఆ తర్వాత సంబంధం లేదని చెబుతున్నా తాజా లెక్కలు మరిన్ని సందేహాలకు తావిస్తున్నాయి. ఇప్పుడు సుపథం టికెట్లే కాదు, వీఐపీ బ్రేక్ దర్శనం, అర్జిత సేవల టికెట్ల లెక్కలు కూడా బయటకు రావాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఈ వివాదంపై సుబ్బారెడ్డి స్పందన ఏమిటన్నది ఆసక్తిగా మారింది.

