రాజకీయాల్లో సమయానికి తగిన విధంగా స్పందించడం చాలా ముఖ్యం. ప్రజల సమస్యలను గుర్తించి వాటిని తమకు అనుకూలంగా మార్చుకోవడమే నేతల విజయ రహస్యం. గతంలో చంద్రబాబు బాదుడే బాదుడు కార్యక్రమం ద్వారా జగన్‌పై వ్యతిరేకత చూపుతూ జనంలోకి వెళ్ళారు, అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వ్యతిరేకతను కూడా ఎన్నికల సమయంలో ఉపయోగించుకున్నారు. కానీ, ఇటీవల దివ్యాంగుల పింఛన్ల విషయంలో వైసీపీ మాత్రం పెద్దగా స్పందించలేదు. రెండు దశాబ్దాలుగా పింఛన్లు తీసుకుంటున్న కొందరిని అనర్హులుగా ప్రకటించడంతో దివ్యాంగులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేశారు. ఈ విషయంపై ప్రతిపక్షం గట్టి పోరాటం చేయాల్సింది… కానీ జగన్ ట్విట్టర్‌లో ఒక ట్వీట్ పెట్టి సరిపెట్టారు. చివరికి ప్రభుత్వం సృష్టించిన సమస్యను.. ప్రభుత్వమే సరిదిద్దుకొని అందరికీ పింఛన్లు ఇస్తామని ప్రకటించింది. ఫలితంగా దివ్యాంగులు తమ సొంత పోరాటంతోనే ఫలితం సాధించుకున్నట్లు అయంది.. ఈ విషయంలో ప్రతిపక్షం, ముఖ్యంగా జగన్ పాత్ర అసలు లేకపోవడం ఆలోచించదగిన అంశం.

