ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్న వేళ సీఎం చంద్రబాబు మళ్లీ ఉచిత ఇళ్ల ప్రకటనతో చర్చనీయాంశమయ్యారు. గత పాలనలో చేసిన తప్పులు మళ్లీ పునరావృతమవుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికల హామీల అమలే ప్రభుత్వానికి పెద్ద భారమై ఉన్న సమయంలో, మరోసారి లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పటం అధికారులు ఆందోళన చెందేలా చేస్తోంది. వచ్చే ఏడాది మార్చి నాటికి 10 లక్షల ఇళ్లు, ఇందులో వచ్చే నెలలోనే 3 లక్షల ఇళ్లు, సంక్రాంతికి మరో 2 లక్షల ఇళ్లు పూర్తి చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. కానీ లబ్ధిదారుల ఎంపికలో గందరగోళం, కేటాయింపుల్లో తప్పులు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. పేదలకు ఇళ్లు ఇవ్వాలన్న ఉద్దేశం మంచిదే కానీ, కేటాయింపులలో అసంతృప్తి ఎక్కువవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. నిపుణులు మాత్రం ఇళ్ల కంటే అమరావతిలో మౌలిక వసతుల అభివృద్ధి, పెట్టుబడులను ఆకర్షించే నిర్ణయాలు తీసుకుంటే ప్రభుత్వానికి ఎక్కువ మైలేజీ వస్తుందని సూచిస్తున్నారు.

