చిలకలూరిపేట వైసీపీ ఇన్‌చార్జ్‌గా మాజీ మంత్రి విడుదల రజనిని తిరిగి నియమించడం పార్టీ లోపల పెద్ద చర్చకు దారి తీసింది. రజనీపై స్థానికంగా వ్యతిరేక వర్గం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఆమె కారణంగానే నాయకులు, కార్యకర్తలు దూరమయ్యారని, కేసులు పడిన వారు ఇంకా ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తున్నారు. 2019లో ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రి పదవిలో ఉండగా తాను విభేదించిన వారిని కక్ష పెట్టి వ్యవహరించారని విమర్శలు వినిపిస్తున్నాయి. 2024లో గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి ఓడిన రజనీ మళ్లీ చిలకలూరిపేటకు వచ్చి ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు చేపట్టడం, మర్రి రాజశేఖర్ పార్టీని వీడిన నేపథ్యంలో, స్థానికంగా బలమైన నేతను పెట్టాలని డిమాండ్ మరింత బలపడుతోంది. కానీ పార్టీ అధిష్టానం మాత్రం రజనీకే పగ్గాలు అప్పగించిందని స్పష్టమవుతోంది. దీంతో రజనీ వ్యతిరేక వర్గం ఆగ్రహంగా ఉండగా, దీనిని పార్టీ ఎలా సర్దుబాటు చేస్తుందో వేచి చూడాలి.

