ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరోసారి రాష్ట్ర పోలీసులపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన పరకామణి కుంభకోణం కేసులో కోర్టు ఆదేశాలను పోలీసులు పట్టించుకోకపోవడంతో కోర్టు సీరియస్ అయింది.
2023లో వైసీపీ ప్రభుత్వ కాలంలో పరకామణి డిప్యూటీ ఈవో సీవీ రవికుమార్ కోట్ల రూపాయల నగదు, బంగారం అపహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసులో ఛార్జీషీట్ దాఖలు అయినా, తర్వాత లోక్‌అదాలత్‌లో రాజీ చేసుకున్నారు. ఈ వ్యవహారంపై ఓ జర్నలిస్టు హైకోర్టును ఆశ్రయించారు.
గత నెలలో హైకోర్టు, ఆ కేసుకు సంబంధించిన అన్ని రికార్డులు, లోక్‌అదాలత్ పత్రాలు, టీటీడీ తీర్మానాలను సీజ్ చేసి సీల్డ్ కవర్‌లో సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. కానీ పోలీసులు, సీఐడీ ఐజీ పోస్టు ఖాళీగా ఉందని చెప్పి ఆదేశాలను అమలు చేయలేదు.
దీనిపై కోర్టు తీవ్రంగా స్పందిస్తూ.. రాష్ట్రంలో పోలీస్ శాఖను మూసేయడం మంచిది. డీజీపీ నిద్రపోతున్నారా? అని ఘాటుగా వ్యాఖ్యానించింది. అనంతరం, రాబోయే విచారణకు సంబంధిత రికార్డులను తప్పనిసరిగా సమర్పించాలని ఆదేశించింది.

