ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉప్పాడలో చేసిన ప్రసంగం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన మాటల్లో ఆవేశమా? భావోద్వేగమా? లేక తన నిబద్ధతపై ప్రజలకు హామీనా? అన్నదానిపై చర్చ మొదలైంది.
ఉప్పాడలో మత్స్యకారులతో మాట్లాడిన పవన్, మీ సమస్యలు పరిష్కరించలేని రోజు నేను రాజకీయాలు వదిలేస్తాను. అంటూ సంచలన కామెంట్ చేశారు. మత్స్యకారుల కష్టాలు తనవే అని, వారి కోసం తాను ఉన్నానని స్పష్టం చేశారు. మీరు తిడితే పడతాను, దెబ్బ పడితే భుజం కాస్తాను. నేను మీ వాడిని అని అంటూ పవన్ భావోద్వేగంగా మాట్లాడారు.
ఉప్పాడ ప్రాంతంలో పొల్యూషన్ కారణంగా సముద్ర సంపద నష్టపోయి వేట దెబ్బతిన్నదని పవన్ అంగీకరించారు. సమస్యల పరిష్కారానికి 100 రోజుల సమయం అడిగి, ఆ సమయంలో సమగ్రమైన ప్రణాళికతో అన్ని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
అలాగే కాలుష్యాన్ని అంచనా వేయడానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులతో ఆడిట్ చేయాలని ఆదేశించారు. తానే స్వయంగా కలుషిత ప్రాంతాలను పరిశీలిస్తానని తెలిపారు. తీర ప్రాంత భద్రత కోసం రక్షణ గోడ నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తానని చెప్పారు.
వేట సమయంలో మరణించిన 18 మంది మత్స్యకారుల కుటుంబాలకు 90 లక్షల పరిహారం పవన్ స్వయంగా అందించారు.
ఉప్పాడ సందర్శనతో పవన్ కళ్యాణ్ మత్స్యకారుల మనసు గెలుచుకున్నారని విశ్లేషకులు అంటున్నారు.

