అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన భారీ టారిఫ్ దెబ్బతో ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామన్న కారణంతో భారత్‌పై అమెరికా మొదట 25%, తర్వాత 50% వరకు సుంకాలు విధించింది. దీంతో ఏపీ నుంచి అమెరికాకు వెళ్లే రొయ్యల ఎగుమతులు ఒక్కసారిగా ఆగిపోయాయి. దాదాపు 25 వేల కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు చెబుతున్నారు. కంటెయినర్లలో సిద్ధంగా ఉన్న సరుకుపైనే 600 కోట్ల భారమొచ్చింది. గోదావరి జిల్లాలు, నెల్లూరు ప్రధానంగా రొయ్యల ఉత్పత్తిలో ముందుండగా, రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయారు.
అమెరికా విధించిన సుంకాలు మొత్తం 59.72% వరకు పెరగడంతో రైతులు షాక్‌కి గురయ్యారు. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని జోక్యం చేసుకోవాలని కోరారు. జీఎస్టీ ఊరటతోపాటు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దేశీయ వినియోగాన్ని పెంచడమే కాకుండా యూరోపియన్ యూనియన్, దక్షిణ కొరియా, సౌదీ అరేబియా, రష్యా వంటి దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఏటా 21 వేల కోట్లకు పైగా విలువ చేసే రొయ్యల ఎగుమతులు నిలిచిపోవడంతో 2.5 లక్షల రైతు కుటుంబాలు, 30 లక్షల మంది జీవనాధారం కష్టాల్లో చిక్కుకున్నాయి.
అమెరికా సుంకాల దెబ్బతో ఏపీ అక్వా రంగం కుదేలయ్యే పరిస్థితి, 25 వేల కోట్ల నష్టంతో, లక్షలాది రైతు కుటుంబాలు ఇబ్బందుల్లో పడుతున్నారు.

