ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు హైకోర్టులో ఊహించని షాక్ ఎదురైంది. ఆయన నటించిన హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్ కోసం ప్రభుత్వ వనరులను వాడుకున్నారని మాజీ ఐఏఎస్ అధికారి, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్‌కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ తన హోదాను ఉపయోగించి సినిమా టికెట్ ధరల పెంపు ఫైల్‌ను స్వయంగా ప్రాసెస్ చేశారని, ప్రచారానికి ప్రభుత్వ నిధులు వినియోగించారని ఆరోపించారు. మంత్రి వ్యాపార కార్యక్రమాల్లో నేరుగా పాలుపంచుకోవడం నియమాలకు విరుద్ధమని వాదించారు. ఈ విషయంపై సీబీఐ లేదా ఏసీబీ దర్యాప్తు జరిపించాలని కోరినా, ఆ దశలోనే నోటీసులు ఇవ్వాలని చేసిన అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. అయితే కేసును కొట్టివేయకుండా విచారణకు స్వీకరించడం పవన్ కళ్యాణ్‌కు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. కేసు తదుపరి విచారణను మరో వారం రోజులకు వాయిదా వేసింది. హరిహర వీరమల్లు బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన అందుకున్న వేళ, ఇప్పుడు కేసు వివాదం కొత్త సమస్యగా మారింది.

