అమెరికాలో ఉన్నత విద్య చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థులకు గట్టి దెబ్బ తగిలింది. అమెరికా విదేశాంగ శాఖ తాజాగా దాదాపు 6,000 మందికి వీసాలు రద్దు చేసింది. వీరిలో ఎక్కువ మంది చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినవారేనని అధికారులు తెలిపారు. మత్తులో డ్రైవింగ్, దాడులు, దోపిడీలు చేసిన విద్యార్థుల వీసాలు రద్దు చేయగా, ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్న 300 మందికి పైగా విద్యార్థులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ట్రంప్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అంతర్జాతీయ విద్యార్థులపై కొత్త నిబంధనలు అమలు చేస్తోంది. సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించడం, యాంటీ సెమిటిజం వ్యతిరేక బిల్లుతో సంబంధం ఉన్న విద్యార్థులపై చర్యలు, కొత్త వీసా ఇంటర్వ్యూలను నిలిపివేయడం వంటి నిర్ణయాలు తీసుకుంది. ఈ పరిస్థితుల కారణంగా హార్వర్డ్ వంటి ప్రముఖ విశ్వవిద్యాలయాలకే విదేశీ విద్యార్థులను చేర్చుకోవడంలో ఇబ్బందులు వస్తున్నాయి. ప్రస్తుతం అమెరికాలో 10 లక్షలకుపైగా విదేశీ విద్యార్థులు చదువుతున్నారు. వీరి ద్వారా అమెరికాకు సంవత్సరానికి 43 బిలియన్ డాలర్ల ఆదాయం వస్తోంది. ఇప్పుడు వీసా రద్దులు, కఠిన షరతులు బయటపడటంతో, భవిష్యత్తులో అమెరికాలో చదవాలనుకునే విద్యార్థులకు ఇది పెద్ద ఛాలెంజ్ గా మారనుంది.

