స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కాదు: జగన్ హామీ

ఆసియా ఖండంలో నాణ్యమైన ఉక్కు ఉత్పత్తి చేసే అతి పెద్ద కర్మాగారం.. విశాఖ స్టీల్ ప్లాంట్. సాగరతీరంలో ఉన్న ఏకైక స్టీల్ ప్లాంట్ ఇది. దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా విశాఖ ఉక్కుకు మంచి పేరు ఉంది. కానీ గత కొన్ని ఏళ్లుగా ఈ ప్లాంట్ చుట్టూ ప్రైవేటీకరణ ముసురు కమ్ముకుంది.
2021లో కేంద్రం నూరు శాతం ప్రైవేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఆ తీర్మానం ఇంకా వెనక్కి తీసుకోలేదు. దీంతో కార్మిక సంఘాలు నిరసనలు కొనసాగిస్తున్నాయి. రాజకీయ పార్టీలు మాటల్లో మాత్రమే మద్దతు ఇస్తున్నాయని, కానీ ఢిల్లీ స్థాయిలో ఒత్తిడి చేయడం లేదని కార్మిక నాయకులు విమర్శిస్తున్నారు.
సీఎంగా ఉన్నప్పుడు జగన్ విశాఖ ఉక్కు కాపాడాలని అసెంబ్లీలో తీర్మానం చేశారు. ప్రధానికి లేఖ రాశారు, మోడీని నేరుగా కలసి అభ్యర్థించారు. అయితే ఆ తర్వాత కేంద్రంపై ఒత్తిడి తేలికగా మారిందని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు విపక్షంలో ఉన్నప్పటికీ జగన్ మా స్టాండ్ అదే.. విశాఖ ఉక్కు ప్రైవేట్ కాకూడదని స్పష్టం చేశారు.
తాజాగా విశాఖ పర్యటనలో కార్మిక సంఘాలను కలసిన జగన్, ప్లాంట్‌ను సందర్శించమని వారు కోరగా, ఆయన అంగీకరించారు. ఈసారి నిజంగా ప్లాంట్‌లోకి వెళ్తారా అనే ఆసక్తి నెలకొంది. జగన్ వెళ్లితే ఉద్యమానికి కొత్త ఊపు వస్తుందని కార్మికులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *