వైఎస్సార్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ సిట్ మళ్లీ దృష్టి సారించింది. మద్యం విధానంలో అవినీతి ఆరోపణలపై ఇప్పటికే అరెస్టయి 70 రోజులకుపైగా రాజమండ్రి జైలులో ఉన్న మిథున్ రెడ్డి, ఇటీవల బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే.
తాజాగా మంగళవారం సిట్ అధికారులు హైదరాబాద్‌లోని కొండాపూర్, ఫిల్మ్‌నగర్, గాయత్రీహిల్స్, ప్రాంతాల్లోని ఆయన నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. అలాగే బెంగళూరులోనూ ఆయనకు చెందిన ఆస్తులకు సంబంధించి సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాల్లో నాలుగు టీమ్‌లు పాల్గొని పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులు, సిబ్బందిని కూడా ప్రశ్నించినట్లు తెలిసింది.
మద్యం విధాన అవినీతి కేసులో మిథున్ రెడ్డి A4 నిందితుడిగా ఉన్నారు. వైఎస్సార్సీపీ పాలనలో రూ.3 వేల కోట్లకుపైగా అవినీతి జరిగిందని ఆరోపణల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం సిట్ విచారణ చేపట్టింది.
బెయిల్‌తో బయటకు వచ్చిన తర్వాత మిథున్ రెడ్డిని పార్టీ తిరిగి రీజినల్ కోఆర్డినేటర్‌గా నియమించింది. ఇదే సమయంలో ఆయనను ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాలకు భారత ప్రతినిధిగా ఎంపిక చేయడం కూడా చర్చనీయాంశమైంది.
ఇక రాష్ట్రంలో నకిలీ మద్యం వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారిన వేళ, సిట్ మిథున్ రెడ్డి ఇళ్లలో సోదాలు జరపడం రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.

