రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి మొదలయ్యాయి. కానీ మొత్తం కూటమి ఎమ్మెల్యేలు 164 మంది ఉంటే హాజరైన వారు కేవలం 45 మంది మాత్రమే. అంటే నాలుగవ వంతు కూడా రాలేదు. దీంతో సభలో ఖాళీ సీట్లు కనిపించాయి.
స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇప్పటికే పలుమార్లు సభ్యులు సభకు రావాలని కోరినా పరిస్థితి మారలేదు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు సభ వేదిక అని ఆయన గుర్తుచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఎమ్మెల్యేలు తప్పక హాజరవ్వాలని సూచించారు. అయినా మొదటి రోజునే చాలామంది రాకుండా ఉండటంతో విమర్శలు వచ్చాయి.
ఇప్పటివరకు వైసీపీని హాజరు కాకపోవడంపై విమర్శించిన కూటమి ఎమ్మెల్యేలే పెద్ద సంఖ్యలో రాకపోవడం ఏంటనే ప్రశ్న తలెత్తుతుంది. ప్రజలకు ప్రతినిధులుగా ఉన్న వారు ఇంత ముఖ్యమైన సమావేశాలకు రాకపోతే బాధ్యత ఎక్కడన్నది ప్రజలు అడుగుతున్నారు. పది రోజులు అనుకున్న సమావేశాలను ఎనిమిది రోజులకు కుదించారు. ఈ నెల 27న ముగుస్తాయి. నాలుగు కీలక బిల్లులు ఆమోదించనున్నారు. మిగతా రోజుల్లో సభ్యుల హాజరు పెరుగుతుందో లేదో చూడాలి.

