దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విద్యార్హతల వివాదం మరోసారి చర్చనీయాంశమైంది. మోడీ ఇప్పటికే మూడు సార్లు ప్రధాని అయ్యి, పదకొండేళ్లుగా దేశాన్ని నడిపిస్తున్నారు. నెహ్రూ, ఇందిరాగాంధీ తర్వాత ఎక్కువ కాలం ప్రధానిగా కొనసాగిన నాయకుడిగా రికార్డు సృష్టించారు. కానీ ఆయన డిగ్రీ గురించి ప్రతిపక్ష నేతలు ఎప్పట్నుంచో ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. తాజాగా ఢిల్లీ హైకోర్టు తీర్పులో, మోడీ తన విద్యార్హతలను బయట పెట్టాల్సిన అవసరం లేదని స్పష్టమైంది. ఇదే విషయాన్ని కేంద్ర సమాచార కమిషన్ 2016లో ఢిల్లీ యూనివర్సిటీని డైరెక్ట్ చేసినా, ఇప్పుడు కోర్టు ఆదేశాలను రద్దు చేసింది. వికీపీడియా ప్రకారం, మోడీ 1978లో ఢిల్లీ యూనివర్సిటీ నుండి పొలిటికల్ సైన్స్ లో బీఏ, 1983లో గుజరాత్ యూనివర్సిటీ నుండి ఎంఏ పూర్తి చేసినట్టు వివరాలు ఉన్నాయి. అయితే ఈ డిగ్రీల నిజానిజాలపై విపక్షాలు ఇంకా ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉన్నాయి. హైకోర్టు తీర్పుతో ఈ ఇష్యూ మరోసారి బిగ్ డిబేట్‌గా మారింది.

