అమెరికా సెనెటర్.. బిల్ హాగెర్టీ చేసిన తాజా కామెంట్స్ కొత్త రాజకీయాలపై చర్చకు దారితీశాయి. 2020లో గాల్వాన్ లోయలో భారత్-చైనా ఘర్షణ సమయంలో చైనా విద్యుత్ అయస్కాంత ఆయుధాలు వాడిందని ఆయన ఆరోపించారు. అయితే ఈ ఆరోపణకు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవు. భారత, చైనా ప్రభుత్వాలు కూడా దీన్ని ధ్రువీకరించలేదు.
విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, అమెరికా ఈ తరహా వ్యాఖ్యలతో భారత్-చైనా మధ్య గ్యాప్ పెంచి, భారత్‌ను తనవైపు మరింత దగ్గర చేసుకోవాలని చూస్తోంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో.. చైనా పెరుగుతున్న ప్రభావాన్ని ఎదుర్కోవడానికి భారత్‌ను కీలక మిత్రుడిగా మార్చుకోవడమే అమెరికా వ్యూహమని భావిస్తున్నారు.
ఇక భారత్ మాత్రం అమెరికా, చైనా, రష్యా వంటి దేశాలతో సమానమైన సంబంధాలు కొనసాగించాలని ప్రయత్నిస్తోంది. ఇటీవల మోదీ.. జిన్ పింగ్ సమావేశం, SCOలో భారత్ చురుకైన పాత్ర దీనికి నిదర్శనం.
మొత్తానికి, హాగెర్టీ వ్యాఖ్యలు కేవలం ఆరోపణలు మాత్రమే కాకుండా, అమెరికా వ్యూహాన్ని చూపిస్తున్నాయి. భారత్ మాత్రం స్వతంత్ర విదేశాంగ విధానాన్ని పాటిస్తూ, అన్ని శక్తుల మధ్య సమన్వయంగా కాపాడాలని కృషి చేస్తోంది.

