భారత్‌లో జరగనున్న క్వాడ్ దేశాధినేతల సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరయ్యే అవకాశం ఉందని అమెరికా కొత్త రాయబారి సెర్గియో గోర్ తెలిపారు. సెనేట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీ ముందు మాట్లాడుతూ ఆయన ఈ విషయం వెల్లడించారు.
ఈ సమావేశానికి హాజరై క్వాడ్ బలోపేతానికి కట్టుబడి ఉన్నారని ట్రంప్ సంకేతాలిచ్చారని గోర్ చెప్పారు. ఇప్పటికే ఆయన పర్యటనపై చర్చలు కూడా జరిగాయని సమాచారం. ఈ ఏడాది చివర్లో భారత్‌లో సదస్సు జరగనుంది. అయితే ఖచ్చితమైన తేదీ ఇంకా నిర్ణయించలేదు.
గత ఫిబ్రవరిలో అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, ట్రంప్‌ను ఈ సదస్సుకు ఆహ్వానించారు. భారత్‌తో సంబంధాలు మరింత బలపడటం తమకు అత్యంత ప్రాధాన్యం అని గోర్ స్పష్టం చేశారు.
అమెరికా లక్ష్యం భారత్‌ను మరింత చేరువ చేసుకోవడం, చైనాతో దూరం పెంచడం అని ఆయన స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య తాత్కాలిక సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
క్వాడ్‌లో భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా సభ్యులుగా ఉన్నారు.

