తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. తెలంగాణలో బీజేపీకి ఎవరి మద్దతు అవసరం లేదు… ఇక్కడ మేము ఒంటరిగానే బలంగా ఉన్నాం అని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో జనసేనతో పొత్తు ఉన్నప్పటికీ తెలంగాణలో అలాంటి కూటమి లేదని చెప్పారు. పవన్ కళ్యాణ్ ప్రచారానికి వస్తారా అనే ప్రశ్నకు ఎన్నికలు అయిపోయిన తర్వాత వస్తాడా?అంటూ చేసిన వ్యాఖ్యలు జనసేన శ్రేణుల్లో అసంతృప్తిని రేకెత్తించాయి.
ఎన్నికల ముందు ఆహ్వానం ఇచ్చి ఇప్పుడు అవసరం లేదనడం సరైంది కాదని జనసైనికులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. రాజకీయ విశ్లేషకులు మాత్రం తెలంగాణలో బీజేపీ స్వతంత్రంగా బలపడాలనే వ్యూహంలో భాగంగానే ఈ వ్యాఖ్యలు వచ్చి ఉండొచ్చని చెబుతున్నారు. అయితే ఈ మాటల యుద్ధం రెండు పార్టీల భవిష్యత్ సమన్వయంపై ప్రభావం చూపుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీ లేదా జనసేన అధినేతల స్పందనపై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది.

