ఏపీ రాజకీయాల్లో మరోసారి అన్నా–చెల్లెళ్ల మాటల యుద్ధం వేడెక్కింది. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, వైసీపీ అధినేత జగన్‌పై ఘాటు విమర్శలు చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగానికి హాజరైన జగన్ కొద్దిసేపటికే సభను వీడటం పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష నాయకుడిగా జగన్ పూర్తిగా విఫలమయ్యారని, ప్రజా సమస్యలపై మాట్లాడకుండా మైక్ కోసం మారాం చేయడం సరైంది కాదని ఎద్దేవా చేశారు.
రాయలసీమకు ద్రోహం చేసిన వారిలో జగన్, బాబు ఇద్దరూ సమానమని ఆమె విమర్శలు గుప్పించారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ఎమ్మెల్యేలు సభలో సమస్యలు లేవనెత్తాలని, లేదంటే రాజీనామా చేయాలని కూడా షర్మిల సవాల్ విసిరారు. కాంగ్రెస్ ఉనికి పోరాటం చేస్తున్నా, షర్మిల చేస్తున్న ఈ దూకుడు వ్యాఖ్యలు వైసీపీపై ఒత్తిడిని పెంచుతున్నాయి.
ఇప్పుడు ప్రశ్న ఒక్కటే—వైసీపీ అసెంబ్లీలో మరింత దూకుడుగా వ్యవహరిస్తుందా? లేక రాజకీయ వ్యూహాన్ని మార్చుకుంటుందా? ఏపీ రాజకీయాల్లో ఈ పరిణామాలు మరింత ఆసక్తి రేపుతున్నాయి.

