వైసీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందుల నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1955లో ఏర్పడిన ఈ నియోజకవర్గం వైఎస్సార్ కుటుంబానికి కంచుకోటగా నిలిచింది. వైఎస్సార్ రెండు సార్లు హ్యాట్రిక్ విజయాలు సాధించగా, ఇప్పుడు జగన్ కూడా 2014, 2019, 2024లో హ్యాట్రిక్ సాధించారు..
అయితే తాజాగా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలవడంతో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. దీంతో పులివెందులలో పార్టీ పట్టు పోకుండా ఉండేందుకు జగన్ కొత్త వ్యూహం మొదలుపెట్టారు. ఈ నియోజకవర్గానికి వైఎస్ భారతిని ముందుకు తీసుకొస్తున్నారని చెబుతున్నారు.
భారతి ఇప్పటికే వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. ఇంటింటి ప్రచారం అనుభవం కూడా ఉన్న ఆమెకు ప్రజల్లో మంచి పరిచయం ఉంది. దీంతో జగన్ లేని లోటును పూరించేందుకు ఆమె నేరుగా ప్రజలతో టచ్ లో ఉంటారని అంటున్నారు.
ఇక చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కుప్పంలో పార్టీ కార్యక్రమాలు చూసుకుంటున్నట్టే, పులివెందులలో భారతి కూడా బాధ్యతలు చేపట్టనున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే దీని వెనుక మరింత పెద్ద ప్లాన్ ఉందా? వచ్చే ఎన్నికల్లో భారతి నేరుగా పోటీ చేస్తారా? అన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో మొదలైంది.

