ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మరోసారి సామాజిక ఆధిపత్యం, రాజకీయ ఆధిపత్యం పోరు వేడెక్కుతోంది. జిల్లాలో బీసీలకే పెత్తనం ఉన్నా, ఆ వర్గాల్లోనే గట్టి తగాదాలు కనిపిస్తున్నాయి. తాజాగా వైసీపీ నుంచి సస్పెండ్ అయిన దువ్వాడ శ్రీనివాస్ మళ్లీ రంగంలోకి వచ్చారు. చీరల వ్యాపారంలో బిజీగా ఉన్న ఆయన, ఇప్పుడు ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు అనూహ్యంగా అండగా నిలిచారు. కూనపై జరుగుతున్న వివాదాల వెనక టీడీపీలో అచ్చెన్నాయుడు, వైసీపీలో ధర్మాన కృష్ణదాస్ ఉన్నారని దువ్వాడ ఆరోపించారు. కూన ఒంటరివారు కారని తానే అండగా ఉంటానని స్పష్టం చేశారు. ఈ పరిణామాలతో దువ్వాడ టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారనే మాట వినిపిస్తోంది. కూనకు త్వరలో మంత్రి పదవి వస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేయడం కూడా రాజకీయ చర్చకు దారితీసింది. గతంలో తీవ్రంగా టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న దువ్వాడ, ఇప్పుడు కూన కోసం అచ్చెన్నాయుడిని టార్గెట్ చేస్తూ, ధర్మాన ఫ్యామిలీని ఎత్తి చూపడం జిల్లా రాజకీయాల్లో కొత్త సమీకరణలకు దారితీస్తోందని విశ్లేషకులు అంటున్నారు.

