ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత బస్సు ప్రయాణ పథకం స్త్రీశక్తిని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. విజయవాడ PN బస్టాండ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ హాజరయ్యారు. ఉండవల్లి నుంచి ఆర్టీసీ బస్సులోనే వచ్చిన సీఎం చంద్రబాబు, మార్గమధ్యలో మహిళలతో మాట్లాడారు. ఆయన ముందుగా, పవన్, లోకేశ్, మాధవ్ వెనుక సీట్లలో కూర్చోగా మిగతా సీట్లు మహిళలతో నిండిపోయాయి. విజయవాడలో దారిపొడవునా మహిళలు ఘన స్వాగతం పలికారు. అనంతరం సభలో సీఎం, పవన్ సంయుక్తంగా జెండా ఊపి పథకాన్ని ప్రారంభించారు. విజయవాడ బస్టాండ్ నుంచి ఐదు రకాల బస్సులు మహిళలతో బయలుదేరాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఎన్నికల హామీని నెరవేర్చామన్నారు. పవన్ కల్యాణ్ అనుమానం వ్యక్తం చేసినా ప్రజల మద్దతుతో సాధ్యమని చెప్పానని గుర్తు చేశారు. ఇకపై శ్రీకాకుళం నుంచి శ్రీశైలం వరకు మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని వెల్లడించారు. ఆడబిడ్డలు అత్తింటి నుంచి కన్నింటికీ కూడా ఉచితంగా తిరగొచ్చని హాస్యంగా అన్నారు. పవన్, లోకేశ్, మాధవ్ ప్రసంగిస్తూ మహిళల భద్రత, గౌరవం, సౌకర్యం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

