టాలీవుడ్, కోలీవుడ్‌లో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సమంత రూత్ ప్రభు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. గౌతమ్ మీనన్ ‘ఏ మాయ చేశావే’తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన సమంత, ‘దూకుడు’, ‘ఈగ’, ‘అత్తారింటికి దారేది’, ‘రంగస్థలం’, ‘ఓ బేబీ’ వంటి హిట్ సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా నిలిచారు. తమిళంలోనూ ‘తేరి’, ‘మెర్సల్’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు పొందారు. వ్యక్తిగత జీవితంలో నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత, సమంత ఒంటరిగానే తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. కొంతకాలం మయసైటీస్ డిసీజ్ తో పోరాడినా, ధైర్యంగా ఎదుర్కొని మళ్లీ సినిమాల్లోకి వచ్చారు. ప్రస్తుతం బాలీవుడ్ వెబ్‌సిరీస్‌లు సహా కొత్త ప్రాజెక్టులు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అయితే, ఇకపై వరుసగా సినిమాలు చేయకుండా, శారీరక-మానసిక ఆరోగ్యానికే ప్రాధాన్యం ఇస్తూ తక్కువ ప్రాజెక్టులు మాత్రమే ఎంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమంత స్పష్టం చేశారు. కానీ ఎంచుకునే పాత్రలు మాత్రం ప్రేక్షకుల మనసుకు నచ్చేలా నాణ్యతతో ఉంటాయని హామీ ఇచ్చారు.

