ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు పది సంవత్సరాల తర్వాత విద్యుత్ సంస్థల్లో ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 9849 ఖాళీల్లో 75% భర్తీ చేయాలని నిర్ణయించింది. ఇందులో టెక్నికల్ విభాగంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్ పోస్టులతో పాటు సివిల్, ఎలక్ట్రికల్, టెలికం, ఐటీ విభాగాల్లో నియామకాలు ఉండనున్నాయి. అలాగే నాన్ టెక్నికల్ విభాగంలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్లు, జూనియర్ లైన్మెన్, ఎనర్జీ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయనున్నారు. గతంలో 2014లో టిడిపి ప్రభుత్వం స్వల్పంగా నియామకాలు చేసిన తరువాత, వైసిపి హయాంలో మాత్రం ఐదేళ్లు ఖాళీల భర్తీ జరగలేదు. పదోన్నతులు, రిటైర్మెంట్ల కారణంగా 40 శాతం పోస్టులు ఖాళీగా ఉండడంతో సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగింది. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నిరుద్యోగులకు పెద్ద శుభవార్తగా మారింది.
కొత్త నియామకాలతో విద్యుత్ సంస్థల్లో పనితీరు మెరుగుపడటంతో పాటు, సిబ్బందిపై ఉన్న ఒత్తిడి తగ్గనుంది.
ఈ భర్తీలు త్వరగా చేపట్టాలని ఉద్యోగ సంఘాలు కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

