ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ ప్రతిపక్ష హోదా చర్చ మొదలైంది. 15 నెలల క్రితం ఓటమి పాలైన వైసీపీకి 11 సీట్లు మాత్రమే వచ్చాయి. అయినా తమకు ప్రతిపక్ష హోదా రావాలని వైసీపీ పట్టుబడుతోంది.
తాజాగా సీఎం చంద్రబాబు, అసెంబ్లీకి రండి, అక్కడే అన్ని విషయాలు మాట్లాడుకుందామని సవాల్ చేశారు. దీనిపై వైసీపీ గట్టిగా స్పందించింది. ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీలో జగన్ అడిగే ప్రశ్నలకు కూటమి ప్రభుత్వం తట్టుకోలేదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా, హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.
అయితే సీఎం చంద్రబాబు మాత్రం, రూల్స్ తెలియక హోదా అడగడం సరైంది కాదు. హోదా ప్రజలే ఇస్తారని సెటైర్లు వేశారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు కూడా వైసీపీ ఎమ్మెల్యేలను సభకు రమ్మని పిలుపునిచ్చారు కానీ ప్రతిపక్ష హోదా విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు.
జగన్ అసెంబ్లీకి వస్తారా రారా అన్నదానిపై ఇంకా క్లారిటీ లేదు. వస్తే కూడా వైసీపీ సంఖ్యా బలం తక్కువ కావడంతో మాట్లాడే సమయం తక్కువగా ఉండే అవకాశం ఉంది.
మొత్తానికి ప్రతిపక్ష హోదా అంశం రాజకీయంగా హాట్ టాపిక్ అవుతూ, జగన్ వర్సెస్ చంద్రబాబు పోరు మరోసారి హైలైట్ అవుతోంది.

