ఉపరాష్ట్రపతి ఎన్నికలో క్రాస్ ఓటింగ్

ఉప రాష్ట్రపతి ఎన్నికలు ఉత్కంఠభరితంగా జరిగాయి. మొదట ఇండియా కూటమి గెలుస్తుందేమో అన్న అనుమానం కలిగించినా చివరికి ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. పోలింగ్ సమయానికి కొన్ని పార్టీలు దూరంగా ఉండగా, మరికొన్ని ఎన్డీఏకి మద్దతుగా నిలిచాయి. ముఖ్యంగా ఇండియా కూటమి పార్టీలకు చెందిన కొందరు ఎంపీలు క్రాస్ ఓటింగ్ చేయడం పెద్ద ట్విస్ట్‌గా మారింది.
తమిళనాడుకు చెందిన రాధాకృష్ణన్‌కు ప్రాంతీయ సెంటిమెంట్ బాగా కలిసొచ్చింది. మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేసిన అనుభవం, వ్యక్తిగత అనుబంధం కూడా ఆయనకు అదనపు ఓట్లు తెచ్చిపెట్టాయి. సమాచారం ప్రకారం డీఎంకే, శివసేన, కాంగ్రెస్, ఆప్, ఆర్జేడీ ఎంపీలలో కొందరు ఎన్డీఏ అభ్యర్థికి ఓటేశారు.
ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి 324 ఓట్లు రావాల్సి ఉండగా కేవలం 300 ఓట్లు మాత్రమే వచ్చాయి. అందులో 15 చెల్లలేదు. మరోవైపు ఎన్డీఏ అభ్యర్థి 452 ఓట్లు సాధించారు. అంటే అదనంగా 14 ఓట్లు క్రాస్ ఓటింగ్ వల్ల వచ్చాయి.
ఈ ఫలితాలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్పందిస్తూ– గెలుపు ఓటమి కంటే పోరాటమే ముఖ్యమని అన్నారు. అయితే తక్కువ ఓట్లు ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి అన్నదానిపై త్వరలో నేతలతో ప్రత్యేక సమావేశం పెట్టనున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *