ఈ ఏడాది ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ సీట్లపై ఏపీలో రాజకీయ వేడి మరింత పెరిగింది. కూటమి పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొనగా, ముఖ్యంగా టీడీపీలో అంతర్గత చర్చలు ఉత్కంఠ రేపుతున్నాయి. రోజుకో కొత్త పేరు రేసులోకి వస్తుండగా, సామాజిక వర్గాల సమీకరణాలు, ప్రాంతీయ లెక్కలు, గత హామీలు అన్నీ కలిసి సస్పెన్స్ గా ఉన్నాయి.
ఇప్పటికే టీడీపీ నుంచి టీడీ జనార్ధన్, భాష్యం రామకృష్ణ, సానా సతీష్ బాబు పేర్లు వినిపిస్తుండగా, అనూహ్యంగా వంగవీటి రాధా పేరు తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది. విజయవాడలో కాపు రాజకీయాలపై ప్రభావం కలిగిన రాధాకు ఇప్పటివరకు పార్టీలో కీలక పదవి దక్కలేదు. గత ఎన్నికల్లో టికెట్ కూడా ఇవ్వకపోవడంతో ఆయన రాజకీయ భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తమయ్యాయి.
అయితే ఇప్పుడు రాజ్యసభ సీటుతో రాధాకు గౌరవ స్థానం కల్పించి, కాపు వర్గాన్ని మరింత దగ్గర చేసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నట్లు ప్రచారం. ఈ నిర్ణయం అమలైతే కోస్తా జిల్లాల్లో టీడీపీకి అదనపు బలం చేకూరే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.

