ఉప రాష్ట్రపతి ఎన్నికల సందర్భంలో వైఎస్ జగన్ వైఖరిపై కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు తీవ్రమైన విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇప్పటికే పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అక్రమ పొత్తు అంటూ జగన్‌ను తప్పుబట్టగా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా కఠిన వ్యాఖ్యలు చేశారు. జగన్ బీజేపీకి దాసుడుగా వ్యవహరిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కేంద్రంలో బీజేపీ తెచ్చిన ప్రతి బిల్లుకూ వైసీపీ మద్దతు ఇస్తుందని, కేసుల కారణంగానే ఈ విధంగా దాసోహం అంటున్నారేమోనన్న అనుమానం వ్యక్తం చేశారు. రామకృష్ణ మాట్లాడుతూ – కేంద్రంలోనూ, ఏపీలోనూ ఎన్డీయే పాలన కొనసాగుతుందని, ఇక్కడ పోరాటం చేస్తామని చెప్పి అక్కడ మద్దతు ఇవ్వడం విరుద్ధమని ప్రశ్నించారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి వైసీపీ మద్దతు ఇవ్వడం ఆశ్చర్యం కాదని, కానీ దీనిపై ప్రజలకు జగన్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇక ఇండియా కూటమి తరఫున తాము ఓసీ వర్గానికి చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టామని, అన్ని పార్టీల ఆమోదంతో ఈ ఎంపిక జరిగిందని రామకృష్ణ తెలిపారు. బీజేపీ విధానాలను వ్యతిరేకించే శక్తులన్నీ తమ అభ్యర్థికి మద్దతు ఇస్తాయని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.

