టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పీ–4 కార్యక్రమంపై తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీ నేతల్లో చర్చనీయాంశంగా మారాయి. ధనవంతులు పేద కుటుంబాలను దత్తత తీసుకోవాలని చంద్రబాబు పిలుపునిస్తున్నారు. తాను స్వయంగా 250 కుటుంబాలను దత్తత తీసుకున్నానని ప్రకటించారు కూడా. అయితే, ఈ నిర్ణయం స్థానికంగా ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఒత్తిడిగా మారుతోంది. ఎందుకంటే పార్టీ నేతల్లో చాలామంది ఆర్థికంగా చాలా బలంగా ఉన్నా, ఇప్పటివరకు ఈ కార్యక్రమంలో ముందుకు రావడం లేదు. సోషల్ మీడియాలో, మీడియాలో వస్తున్న వార్తలు వారిని అసౌకర్యానికి గురి చేస్తున్నాయి.
చంద్రబాబు ఎవరికీ బలవంతం చేయకపోయినా, అంతర్గతంగా కొందరు నేతలు ఈ ప్రాజెక్టుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కొంతమంది ఎంపీలు నేరుగా దత్తత తీసుకోవడం కంటే, ప్రత్యేక పీ–4 ఫండ్ ఏర్పాటు చేసి దానిలో సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని సూచించారు. దీన్ని ఆమోదిస్తే, సమాజంలో మరెక్కువమంది పాల్గొనే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొత్తానికి, చంద్రబాబు సంకల్పం మంచిదే కానీ, అమలులో నేతలు జాగ్రత్తగా ముందడుగు వేస్తున్నారు.

