తెలంగాణలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, లోపాలు ఎక్కువగా జరిగాయని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన పినాకి చంద్రఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్‌ను ఆదివారం సాయంత్రం సభలో ప్రవేశపెట్టారు. దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన అతిపెద్ద అవినీతి స్కామ్ కాళేశ్వరం ప్రాజెక్టు అని, 80 వేల కోట్ల రూపాయల ఖర్చు చేసినా.. 2 లక్షల ఎకరాలకు కూడా నీరు అందించలేదని, ఐదు సంవత్సరాల్లో కేవలం 162 TMC నీరు మాత్రమే అందినట్లు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంలో, డిజైన్ లో, నాణ్యతలో చాలా లోపాలు ఉన్నాయని, కోట్ల రూపాయల సొమ్ము వృథా చేసినట్లు కమిషన్ రిపోర్ట్ స్పష్టం చేస్తుందని చెప్పారు. మేడిగడ్డ కుంగిపోయినా దానిని పట్టించుకోలేదని, ప్రాజెక్టు పూర్తికావడానికి.. లక్షల కోట్ల రూపాయలు అవసరమని, కానీ బిఆర్ఎస్ ప్రభుత్వం హడావిడిగా నిర్మించిందని విమర్శించారు. మంత్రి ప్రసంగానికి బిఆర్ఎస్ నిరసన వ్యక్తం చేయడంతో చిన్న విరామం వచ్చింది, తరువాత పూర్తి వివరాలతో రిపోర్ట్‌ను సభలో ప్రవేశపెట్టారు.

