బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతూ ఈరోజు వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇది ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీరాన్ని దాటి, ఒడిశా–ఛత్తీస్‌గఢ్ వైపు కదిలేలా వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు విదర్భ వద్ద మరో అల్పపీడనం ఏర్పడడంతో నైరుతి రుతుపవనాలు బలపడి తేమతో కూడిన గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో కుంభవృష్టి కురిసే అవకాశం ఉంది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు విశాఖపట్నం, అనకాపల్లి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరిలో రెడ్ అలర్ట్, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, ఈస్ట్ గోదావరి, ఏలూరు, కృష్ణ, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాలలో ఆరంజ్ అలర్ట్, కర్నూలు, అనంతపురం, వైయస్‌ఆర్ కడప, నెల్లూరు, తిరుపతి, చిత్తూరులో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని హెచ్చరించారు. విశాఖ, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో మూడో నంబర్ ప్రమాద సూచికను ఎగరవేశారు.

