TTD లో చుక్క కల్తీ జరిగినా పట్టేస్తారు

తిరుమల క్షేత్రంలో కల్తీకి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు సురక్షితమైన, నాణ్యమైన ప్రసాదాలు అందించాలనే లక్ష్యంతో రూ.25 కోట్ల వ్యయంతో అత్యాధునిక ఫుడ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తోంది. వచ్చే నెలలో ఇది అందుబాటులోకి రానుంది.
ఈ ప్రాజెక్టుకు కేంద్రం–రాష్ట్రం సంయుక్తంగా సహకారం అందిస్తున్నాయి. Food Safety and Standards Authority of India 23 కోట్లు మంజూరు చేసింది. తిరుమల పిండిమిల్లు ఆవరణలో 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ల్యాబ్ ఏర్పాటవుతోంది.
నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, బాదం, శనగలు, చక్కెర, యాలకులు వంటి 60 రకాల ముడిసరకులు, ప్రసాదాల నాణ్యతను క్రమం తప్పకుండా పరీక్షించనున్నారు. కల్తీ నెయ్యి ఘటనను దృష్టిలో ఉంచుకుని ఫ్రాన్స్ నుంచి ఈ-టంగ్, ఈ-నోస్ యంత్రాలను రూ.3.5 కోట్లతో సమకూరుస్తున్నారు. సూక్ష్మస్థాయిలో నాణ్యత లోపాలను గుర్తించే సామర్థ్యం వీటికి ఉంది.
ల్యాబ్‌లో మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ, సెన్సరీ విభాగాలు ఏర్పాటు చేసి పురుగుమందుల అవశేషాలు, భారలోహాలు, యాంటీబయాటిక్స్ వంటి అంశాలను పరీక్షిస్తారు. మొత్తం 50 రకాల యంత్రాలతో 200 రకాల పురుగుమందుల అవశేషాలను గుర్తించే సామర్థ్యం కల్పిస్తున్నారు. ల్యాబ్ నిర్వహణ కోసం 40 మంది సిబ్బందిని నియమించనున్నారు.
ఈ ల్యాబ్ ప్రారంభమైతే తిరుమల ప్రసాదాలపై కల్తీ అనుమానాలకు పూర్తిస్థాయిలో చెక్ పడుతుందని అధికారులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *