తెలంగాణలో 2023 అసెంబ్లీ ఓటమి తర్వాత బీఆర్ఎస్‌కు ప్రతికూల పరిస్థితులు కొనసాగుతున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 17 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ చెరో ఎనిమిది సీట్లు గెలుచుకోగా, మజ్లిస్ ఒకటి దక్కించుకుంది. బీఆర్ఎస్ మాత్రం ఖాతా తెరవలేకపోయింది.
ప్రస్తుతం ఆ పార్టీకి జాతీయ స్థాయిలో ఆధారం రాజ్యసభే. ఏప్రిల్‌లో ఒక సభ్యుడి పదవీ విరమణతో ఎంపీల సంఖ్య నలుగురి నుంచి ముగ్గురికి పడిపోనుంది. వద్ధిరాజు రవిచంద్ర 2030 వరకు, బి. పార్థసారధి రెడ్డి, డి. దామోదర రావు 2028 వరకు కొనసాగనున్నారు.
ఇక రెండు ఖాళీల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశముండటంతో రాజ్యసభలో కాంగ్రెస్‌కు నలుగురు, బీఆర్ఎస్‌కు ముగ్గురు సభ్యుల పరిస్థితి ఏర్పడనుంది. దీంతో జాతీయ స్థాయిలో గులాబీ పార్టీ ప్రభ తగ్గుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

