బీహార్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ ప్రియాంక గాంధీ బీజేపీపై సంచలన కామెంట్స్ చేశారు. ఎప్పుడూ నెహ్రూ, ఇందిరాగాంధీలను తప్పుపట్టడం తప్ప బీజేపీ నేతలు దేశానికి చేసిన పని ఏంటని ఆమె నిలదీశారు. నెహ్రూ, ఇందిర దేశానికి పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు తీసుకువచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేశారు. కానీ బీజేపీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది? ఎన్ని పరిశ్రమలు ఏర్పాటు చేసిందని ఆమె ప్రశ్నించారు.
ప్రియాంకా మాట్లాడుతూ – బీజేపీ నేతలు ఎప్పుడూ గతాన్ని తవ్వుతారు లేదా భవిష్యత్తు కలలు చూపుతారు. కానీ వర్తమానంలో చేసిన పనుల గురించి మాత్రం ఒక్క మాట చెప్పరని విమర్శించారు. బీహార్‌లో ఎన్నేళ్లుగా ఎన్డీయే పాలనలో ఉన్నా, నిరుద్యోగ సమస్య పరిష్కారం కాలేదని ఆమె మండిపడ్డారు.
ఇప్పుడేమో ఎన్నికల హామీగా కోటి ఉద్యోగాలు ఇస్తామని చెబుతున్నారు. కానీ ఇప్పటిదాకా ప్రజలకు వాస్తవంగా ఏం చేశారో చెప్పాలంటూ ఆమె ప్రశ్నించారు. బీహార్ నుండి ఎక్కువ మంది వలసలు వెళ్తున్నారని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారని ప్రియాంక ఆరోపించారు. నెహ్రూ–ఇందిరా వారసురాలు ప్రియాంక గాంధీ వేసిన ఈ సూటి ప్రశ్నలు బీజేపీకి చిక్కు ప్రశ్నలుగా మారాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

