హైదరాబాద్ నగర శివార్లలో మరోసారి రేవ్ పార్టీ కలకలం రేపింది. మహేశ్వరం మండలంలోని కె. చంద్రారెడ్డి రిసార్ట్‌లో అర్ధరాత్రి రేవ్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో స్పెషల్ టాస్క్ ఫోర్స్, ఎక్సైజ్ అధికారులు, పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. ఈ దాడిలో 14 మంది మహిళలతో సహా మొత్తం 50 మందిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల సమాచారం ప్రకారం, గుంటూరు ప్రాంతానికి చెందిన ఓ ఫర్టిలైజర్స్ కంపెనీ యాజమాన్యం తమ డీలర్ల కోసం ఈ పార్టీని ఏర్పాటు చేసింది. అనుమతి లేకుండా భారీగా ఫారిన్ లిక్కర్ విక్రయం జరగడం, డ్రగ్స్ వినియోగం జరగడం గుర్తించిన అధికారులు మాదకద్రవ్యాలు, లిక్కర్, పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. రేవ్ పార్టీ నిర్వాహకుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనతో హైదరాబాద్‌లో డ్రగ్స్ సులభంగా లభిస్తున్నాయనే విమర్శలు మళ్లీ వినిపిస్తున్నాయి. గత ఆగస్టులో కొండాపూర్‌లో కూడా ఇలాంటి రేవ్ పార్టీ బయటపడింది. గచ్చిబౌలి పోలీసులు, ఈగిల్ టీమ్ సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి, కొకైన్, ఎక్స్‌టసీ టాబ్లెట్లు, ఎండీఎంఏ వంటి డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు.
కేవలం రెండు నెలల్లోనే మరో రేవ్ పార్టీ బయటపడటం, నగరంలోని డ్రగ్స్ మాఫియా మళ్లీ చురుకుగా మారిందన్న ఆందోళన పెంచుతోంది.

