కరూర్‌ తొక్కిసలాటపై సుప్రీం షాక్

తమిళనాడులోని కరూర్‌లో టీవీకే పార్టీ నిర్వహించిన ర్యాలీలో జరిగిన భయానక తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ప్రమాదంలో 41 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై హైకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని ఆదేశించగా, టీవీకే పార్టీ ఆ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
తాజాగా సుప్రీంకోర్టు ఆ పిటిషన్‌పై విచారణ జరిపింది. తమిళనాడు పోలీసులతోనే సిట్ ఏర్పాటు చేయాలన్న హైకోర్టు ఆదేశాన్ని సర్వోన్నత న్యాయస్థానం వ్యతిరేకించింది. జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎన్వీ అంజరియాల ధర్మాసనం ఈ కేసులో తీర్పును రిజర్వ్ చేసింది.
వాదనలు వినిపించిన పిటిషనర్ ఏఐడీఎంకేకు స్థలం ఇరుకుగా ఉందని చెప్పి అనుమతి ఇవ్వని పోలీసులు, అదే ప్రదేశంలో టీవీకేకు అనుమతి ఇవ్వడం తగదని అన్నారు. అలాగే ఘటన రాత్రి 7:30కి జరిగి, అర్ధరాత్రికల్లా పోస్టుమార్టం పూర్తవడం ఎలా సాధ్యమని కోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
దీనికి రాష్ట్ర న్యాయవాది పి. విల్సన్ సమాధానంగా మృతుల కుటుంబాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడంతో, ప్రజల ఒత్తిడి కారణంగా తక్షణమే పోస్టుమార్టం నిర్వహించామని తెలిపారు. ప్రజల డిమాండ్ మేరకే సమీప జిల్లాల వైద్యులను పిలిపించామని ఆయన వివరించారు.
ఈ వాదనలన్నింటినీ విని, సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. ఫలితం త్వరలో వెలువడనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *