టెక్సాస్ రాష్ట్రం షుగర్ల్యాండ్లోని అష్టలక్ష్మి ఆలయంలో ఇటీవల 90 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇది ఉత్తర అమెరికాలోని అతి ఎత్తైన హిందూ దేవుని విగ్రహంగా గుర్తింపు పొందింది.
కానీ టెక్సాస్ రిపబ్లికన్ పార్టీ నేత అలెగ్జాండర్ డంకన్ సోషల్ మీడియాలో ఈ విగ్రహాన్ని కల్పించబడిన హిందూ దేవుడంటూ వివాదాస్పద కామెంట్స్ చేశారు. అమెరికా క్రైస్తవ దేశమని, అక్కడ ఇలాంటి విగ్రహం ఎందుకు ప్రతిష్టించారంటూ ప్రశ్నించారు. భూమిపై గానీ, ఆకాశంలో గానీ ఏ విగ్రహాన్ని పూజించకూడదని బైబిల్లోని వాక్యాన్ని చెప్పారు.
డంకన్ వ్యాఖ్యలపై హిందూ అమెరికన్ ఫౌండేషన్ HAF (హాఫ్) తీవ్రంగా స్పందించింది. ఇది హిందువులపై ద్వేషాన్ని చూపించే కామెంట్స్ అని ఆ సంస్థ తెలిపింది. నెటిజన్లు కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తూ, అమెరికా రాజ్యాంగంలో మత స్వేచ్ఛ కల్పిస్తుందని గుర్తు చేశారు. కొందరు డంకన్ను, మీరు హిందువు కాకపోయినా, హిందూ గ్రంథాలను గౌరవించడం నేర్చుకోండని సలహా ఇచ్చారు. హనుమాన్ విగ్రహం, మత స్వేచ్ఛ, సహనంపై ప్రపంచమంతా సోషల్ మీడియాలో చర్చలు వేడెక్కుతున్నాయి

