కాకినాడ జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పేరును వాడుకొని సైబర్ నేరగాళ్లు భారీ మోసానికి పాల్పడ్డారు. ఆయన ఫొటో, పేరుతో నకిలీ వాట్సాప్ నంబర్ సృష్టించి, తెలంగాణలోని టీ-టైమ్ సంస్థ ఫైనాన్స్ మేనేజర్‌ను నమ్మించి 92 లక్షలు వసూలు చేశారు. అత్యవసరం.. వెంటనే డబ్బు పంపండంటూ పదేపదే మెసేజ్‌లు పంపడంతో, నిజంగానే ఎంపీ అని నమ్మిన మేనేజర్ పదకొండు సార్లు వివిధ ఖాతాలకు డబ్బులు బదిలీ చేశాడు.
తర్వాత ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తన ఖాతాలను పరిశీలించగా ఈ మోసం బయటపడింది. అసలు తాను ఎప్పుడూ నంబర్ మార్చలేదని, డబ్బులు అడగలేదని స్పష్టం చేశారు. షాక్ అయిన మేనేజర్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.
అయితే, ఫిర్యాదు ఆలస్యంగా రావడంతో 92 లక్షల్లో కేవలం.. 7 లక్షలు మాత్రమే ఫ్రీజ్ అయ్యాయి. మిగతా మొత్తం మోసగాళ్ల చేతుల్లోకే వెళ్లింది.
చిన్న హెచ్చరిక: అధికారుల పేర్లతో వచ్చే మెసేజ్‌లను నమ్మకండి. ఎప్పుడూ క్రాస్ చెక్ చేసుకోండి.

