విశాఖ రుషికొండలో నిర్మించిన భారీ భవనాలు మళ్లీ రాజకీయ చర్చకు దారితీశాయి. వైసీపీ టైమ్‌లో టూరిజం అభివృద్ధి పేరిట నాలుగు బ్లాకులుగా, సుమారు 450 కోట్ల భారీ ఖర్చుతో ఈ భవనాలు నిర్మించారు. అప్పట్లో ఇవి జగన్ అధికార నివాసాల కోసమే కట్టారని, అక్కడే ఉండి పరిపాలన చేస్తారని వైసిపి నేతలు అప్పట్లో చెప్పారు. కానీ జగన్ ఆ భవనాలను చూడకుండానే ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు. ఈ భారీ నిర్మాణాలను ఎలా ఉపయోగించాలనేది ప్రశ్నగా మిగిలిపోయింది. తాజాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రుషికొండ భవనాలను పరిశీలించి, ప్రజాధనం వృధా అయ్యింది, ఇది జగన్ అధికార నివాసం కోసం చేసిన ప్రాజెక్టే అని విమర్శించారు. ఇది ప్రభుత్వం ఆస్తి అని, ప్యాలెస్ అని పిలవకూడదని అన్నారు. రుషికొండ భవనాల వినియోగంపై కూటమి ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో టూరిజం మంత్రి కందుల దుర్గేష్, ఆర్థిక మంత్రి పయ్యావుల, సంక్షేమ శాఖ మంత్రి బాలవీరాంజనేయస్వామి సభ్యులుగా ఉన్నారు. భవనాలను ఎలా ఉపయోగించాలో ప్రభుత్వానికి సిఫార్సు చేస్తారు. పవన్ సందర్శనతో రుషికొండ భవనాల భవిష్యత్తుపై స్పష్టత రానుంది.

