బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత కుటుంబంతో కలిసి ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో శుక్రవారం సాయంత్రం కలుసుకున్నారు. ఉదయమే వెళ్లాలని భావించినా, అప్పాయింట్మెంట్ ఆలస్యమైంది. చివరికి సాయంత్రం కేసీఆర్ వారిని ఆశీర్వదించి, కవితతో ఏకాంతంగా మాట్లాడారు. ఇటీవల జరిగిన పరిణామాలు, తెలంగాణ జాగృతి కార్యక్రమాలపై ఆయన చర్చించినట్లు సమాచారం. డియర్ డాడీ లేఖపై కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసి, నీ పద్ధతి సరి కాదు, మార్చుకోవాలి. పార్టీ లైన్ పాటిస్తేనే గౌరవం ఉంటుందని సూచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కవిత ఈ సమయంలో కన్నీళ్లు పెట్టుకున్నారని ప్రచారం. అదే సమయంలో కేసీఆర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుంది, పదవుల కోసం కాకుండా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ధైర్యం చెప్పినట్లు తెలిసింది. తన కుమారుడి చదువు కోసం అమెరికా వెళ్తున్న కవిత, వెళ్లేముందు తండ్రి ఆశీస్సులు తీసుకున్నట్లు సమాచారం. ఈ భేటీతో తండ్రి–కుమార్తె మధ్య ఉన్న విభేదాలు కొంతవరకు సద్దుమణిగినట్లుగా రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

