హైదరాబాద్‌లో ఫెరారీ కారు బీభత్సం

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్ నెం.45 వద్ద అతివేగంతో దూసుకెళ్తున్న ఫెరారీ కారు అదుపుతప్పి డివైడర్‌పైకి ఎక్కి మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న ప్రభావంతో కారు రోడ్డుకు అవతలివైపు వెళ్లి ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొట్టింది.
ఈ ఘటనలో ఫెరారీ కారు ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఎదురుగా వస్తున్న రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో మొత్తం మూడు కార్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మరికొన్ని ద్విచక్ర వాహనాలు కూడా ఈ ప్రమాదంలో నష్టపోయినట్లు సమాచారం.
ప్రమాదం సమయంలో ఫెరారీ కారులో ఎయిర్‌బ్యాగులు తెరుచుకోవడంతో అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మరోవైపు గాయపడిన పలువురిని స్థానికులు సమీప ఆసుపత్రులకు తరలించారు.
సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ప్రమాదం కారణంగా రోడ్ నెం.45లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ప్రమాదానికి గురైన ఫెరారీ కారు వెంకట రాజారెడ్డి పేరుతో రిజిస్టర్ అయి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, అసలు కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *