పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీలో మళ్లీ కొత్త ఉత్సాహం మొదలైంది. ఉప ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తూనే పార్టీ బలోపేతంపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. కూటమి ప్రభుత్వంలో భాగంగా ఇరవై నెలలు పూర్తవుతున్న వేళ, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం తగ్గిందన్న నివేదికలపై ఆయన సమీక్ష చేపట్టారు.
పార్టీ స్థాపననుంచి శ్రమించిన జనసైనికులకు తగిన గుర్తింపు దక్కలేదన్న భావనను అధినాయకత్వం గమనించింది. నామినేటెడ్ పదవులు ఆశించిన వారికి అవకాశాలు పరిమితమవడంతో కొంత నిరుత్సాహం నెలకొన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేసి, కష్టించి పనిచేసే వారికి పార్టీ పదవులు ఇవ్వాలని నిర్ణయించారు.
ఇక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన తన వాటా సీట్లపై స్పష్టమైన దృష్టి పెట్టింది. పార్టీ కోసం కష్టించిన వారినే బరిలోకి దింపాలని వ్యూహరచన సాగుతోంది. తాజాగా సీనియర్ నేతలు కేడర్‌తో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, అధినాయకత్వం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. మార్చి 14న జరగనున్న జనసేన ఆవిర్భావ సభ నాటికి పార్టీ మళ్లీ జోష్‌లోకి వచ్చి, స్థానిక ఎన్నికల్లో శాతం వంద స్ట్రైక్ రేట్ లక్ష్యంగా ముందుకు సాగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

