ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన 3,500 కోట్ల లిక్కర్ స్కాం దర్యాప్తు కీలక మలుపు తిరిగినట్టుగా చర్చ జరుగుతోంది. ఈ కేసును సీఐడీ సిట్ విచారిస్తోంది. ఇప్పటివరకు 50 మందికి పైగా వ్యక్తులు, సంస్థలను నిందితుల జాబితాలో చేర్చగా, సుమారు 15 మందిని అరెస్టు చేశారు. అయితే ప్రధాన నిందితులుగా పేర్కొన్న ఏ2, ఏ3, ఏ5లపై ఇంతకాలం ఎలాంటి చర్యలు లేకపోవడం సస్పెన్స్ గా మారింది.
ఈ నేపథ్యంలో ఏ2 వాసుదేవరెడ్డిని అకస్మాత్తుగా అరెస్టు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయన స్కాంలో ముఖ్య పాత్ర పోషించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇన్నాళ్లు అప్రూవర్‌గా మారుతారని ప్రచారం జరిగినప్పటికీ, ఇప్పుడు అరెస్టు చేయడం వెనుక వ్యూహం ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సిట్ గతంలో బిగ్‌బాస్, అంతిమ లబ్ధిదారు వంటి పదాలను ప్రస్తావించినా.. ఆ వ్యక్తి పేరు బయటకు రాలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో మిగతా కీలక నిందితులపై కూడా చర్యలు ఉంటాయా? అన్నది ఆసక్తిగా మారింది. ఇదిలా ఉండగా, పల్నాడు పర్యటనలో సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్ మరింత చర్చకు దారి తీశాయి. శక్తివంతులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామనే సంకేతాలిచ్చారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

