ఇసుకలో తైలం తీయడం కష్టమని ఒక కవి చెప్పినా… ఏపీ ప్రభుత్వం మాత్రం ఇసుకలోనే బంగారం ఉందని నమ్ముతోంది. రాష్ట్ర అభివృద్ధికి రేర్ ఎర్త్ మినరల్ కారిడార్‌కు కూటమి ప్రభుత్వం పునాది వేస్తోంది. ఉత్తరాంధ్ర నుంచి నెల్లూరు వరకు సుమారు 970 కిలోమీటర్ల తీరప్రాంతంలో అపారమైన బీచ్ శాండ్ ఖనిజాలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది.
Atomic Minerals Directorate for Exploration and Research ఆధారంగా 102 మిలియన్ టన్నుల నిల్వలను గుర్తించి, 7,762 హెక్టార్లలో ఎనిమిది ప్రాంతాలను గుర్తించింది. వాటిని Andhra Pradesh Mineral Development Corporation కు రిజర్వ్ చేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. శ్రీకాకుళం జిల్లాలో మోనోజైట్, ఇల్మెనైట్, జిర్కాన్, గార్నెట్ వంటి విలువైన మెటల్స్ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
దేశంలో మోనోజైట్ నిల్వల్లో 30 శాతానికి పైగా ఏపీలోనే ఉన్నాయని గనుల శాఖ తెలిపింది. తవ్వకాలతో పాటు వేల్యూ యాడెడ్ పరిశ్రమల ఏర్పాటుతో ఏపీని రేర్ ఎర్త్ మినరల్స్ తయారీ కేంద్రంగా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఇది రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, యువతకు ఉపాధికి కొత్త అవకాశాలు తీసుకురావచ్చని భావిస్తున్నారు.

